: రాజ్ నాథ్ వర్సెస్ ఆజాద్... యూపీ ఫైట్ ఇదే!
దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఇంకా దాదాపుగా ఏడాది సమయమున్నా... అప్పుడే అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలపై వ్యూహ రచనలో మునిగిపోయాయి. ప్రధానంగా రెండు పెద్ద జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ లు ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. యూపీలోని అధికార పార్టీ సమాజ్ వాదీ పార్టీ చేతిలో నుంచి పాలనా పగ్గాలను లాగేసుకోవాలని ఈ రెండు పార్టీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ... తన సీఎం అభ్యర్థిగా కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను రంగంలోకి దించేందుకు యోచిస్తోంది. ఈ దిశగా ఆ పార్టీ యూపీ కేడర్ లో రాజ్ నాథ్ పేరే బలంగా వినిపిస్తోంది. ఒకవేళ సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగకున్నా... ఎన్నికల ప్రచార బాధ్యతలను మాత్రం రాజ్ నాథ్ తన భుజస్కంధాలపై వేసుకోక తప్పని పరిస్థితి. మరోవైపు పునర్ వైభవం కోసం యత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ యూపీ ఎన్నికల్లో సత్తా చాటాలని యత్నిస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీ నిన్న ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ ను ఏఐసీసీలోకి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆయనకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చింది. అంతేకాక ఉత్తరప్రదేశ్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జీగా ఆయనను నియమించింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఆ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలు ‘రాజ్ నాథ్ వర్సెస్ అజాద్’గానే జరగనున్నాయన్న వాదన వినిపిస్తోంది.