: తప్పు చేసుంటే క్షమించండి: టీడీపీ నేత కేఈ ప్రభాకర్
తాను తెలుగుదేశం పార్టీకి గానీ, అధినేత చంద్రబాబునాయుడికి గానీ వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని, పార్టీ తీసుకునే నిర్ణయాలకు ఎల్లప్పుడూ కట్టుబడి వుంటానని, ఒకవేళ తానేదైనా తప్పు చేసుంటే క్షమించాలని కర్నూలు జిల్లా తెలుగుదేశం నేత, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు చంద్రబాబుకు లేఖను రాశారు. రాజ్యసభ ఎన్నికల అనంతరం బీసీలకు స్థానం కల్పించలేదని కేఈ వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై చంద్రబాబు సీరియస్ కాగా, కేఈ స్పందించారు. ఎన్నికల తరువాత కొంతమంది బీసీ నేతలు తనను కలిసేందుకు వచ్చారని, వారు మాట్లాడిన వ్యాఖ్యలు తానన్నట్టుగా ప్రచారం జరిగిందని చెప్పారు. చంద్రబాబంటే తనకు వ్యతిరేక భావం లేదని, గతవారంలో నవనిర్మాణ దీక్ష జరిగిన సమయంలోనూ తాను ప్రతిజ్ఞ చేశానని ఆయన తెలిపారు.