: కాంగ్రెస్ కు షాక్... సిక్కు వ్యతిరేక అల్లర్లపై 75 కేసుల రీఓపెన్ కు సన్నాహాలు
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ ను కేసులు చుట్టుముట్టేశాయి. ఇప్పటికే తన జీవితంలోనే తొలి సారి పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కోర్టు మెట్లెక్కారు. నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన సదరు కేసు సోనియాను ఇంకా వీడలేదు. సోనియాతో పాటు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాందీ, పార్టీ సీనియర్లు మోతీలాల్ ఓరా వంటి తదితర కురువృద్ధులు కూడా ఉన్నారు. తాజాగా ఇందిరా గాంధీ హత్యానంతరం 1984లో సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లకు సంబంధించి కేసులు తిరిగి ఓపెన్ కానున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలపై దాఖలైన ఈ కేసులన్నీ దాదాపుగా క్లోజ్ అయ్యాయి. నాడు సిక్కులను ఊచకోత కోసిన ఘటనలో రాజేశ్ పైలట్ సహా పలువురు కాంగ్రెస్ నేతలున్నారు. కేసులన్నీ మూసేయడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసుల పరిశీలనకు 2015లో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)... మూసేసిన కేసుల్లోని 75 కేసులను తిరగదోడేందుకు రంగం సిద్ధం చేసింది. దీంతో రాజేశ్ పైలట్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు మరోమారు విచారణను ఎదుర్కోక తప్పని పరిస్థితులు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్థన మేరకే బీజేపీ సర్కారు సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.