: మురళీ మనోహర్ జోషికి ఇంత అవమానమా?... ఆవేదన చెందుతున్న అభిమానులు
మురళీ మనోహర్ జోషి... బీజేపీ మూల స్తంభాలుగా చెప్పుకునే వాజ్ పేయీ, లాల్ కృష్ణ అద్వానీల సమకాలీనులుగా, బీజేపీ సీనియర్ నేతగా పేరుంది. అలాంటి వ్యక్తిని బీజేపీ తీవ్ర అవమానానికి గురి చేసింది. అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ 'వికాస్ పర్వ్' పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా, ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో రెండు రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. గత రెండు రోజులుగా మురళీ మనోహర్ జోషి అలహాబాద్ లోనే ఉన్నారు. ఆ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఆయన రెండుసార్లు ప్రాతినిధ్యం కూడా వహించారు. ఆయన విద్య, రాజకీయ జీవితం ప్రారంభమైంది కూడా అక్కడి నుంచే. అలాంటి వ్యక్తికి బీజేపీ ఎలాంటి ఆహ్వానం పంపలేదు. అంతే కాదు, ఈ సందర్భంగా పార్టీ ఏర్పాటు చేసిన పోస్టర్లు, హోర్డింగుల్లో కూడా ఆయన ఫోటో ముద్రించలేదు. వాటిల్లో వాజ్ పేయి, అద్వానీల ఫోటోలను మాత్రం ముద్రించారు. దీనిపై ఆయన సన్నిహిత వర్గాలు ఆవేదన వ్యక్తం చేశాయి. మురళీ మనోహర్ జోషికి జరిగిన అవమానంపై అలహాబాద్ నగరం మొత్తం పోస్టర్లు అంటించి మరీ నిరసన తెలిపారు.