: రూ. 300 లంచం ఇచ్చుకోలేక కుమారుడిని పోగొట్టుకున్న తండ్రి!
మధురైలోని రాజాజీ ఆసుపత్రిలో రూ. 300 రూపాయలు లంచం ఇచ్చుకోలేక తన కుమారుడిని పోగొట్టుకున్న ఓ అభాగ్యపు తండ్రి ఉదంతమిది. ముఖ్యమంత్రి కార్యాలయానికి బాధితుడు జి.గణపతి మొత్తం ఘటనను తెలుపుతూ లేఖ రాయగా, విషయం బయటకు వచ్చింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, గత నెల 2వ తేదీన శ్వాసకోశ సమస్యలతో తన కుమారుడు రాజేంద్ర ప్రసాద్ ను ఆసుపత్రికి తీసుకువెళ్లాడు గణపతి. స్ట్రెచ్చర్ ను తోసుకొచ్చిన ఓ ఉద్యోగి, తనకు లంచం ఇవ్వలేదన్న కారణంగా, అడ్మిషన్ స్లిప్ ను తన వెంట తీసుకుపోయాడు. ఆ స్లిప్ లేకుంటే వైద్యం చేయలేమని చెబుతూ, డాక్టర్లు ఆలస్యం చేశారు. దీంతో సరైన సమయంలో వైద్యం అందక రాజేంద్ర మరణించాడు. చివరకు మార్చురీ నుంచి మృతదేహాన్ని వెలుపలికి తెచ్చేందుకు ఓ మహిళా ఉద్యోగికి రూ. 80 సమర్పించుకోవాల్సి వచ్చింది. ఈ ఘటనపై సీరియస్ గా స్పందించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ జె.రాధాకృష్ణన్, విచారణకు ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో ఫార్మాలిటీస్ గురించి చూడకుండా వైద్యం చేయాలన్న నిబంధనలు ఉన్నాయని ఆయన అన్నారు. పూర్తి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆసుపత్రి డీన్ కు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. కాగా, గణపతి నుంచి డబ్బు డిమాండ్ చేసిన వ్యక్తి ఆసుపత్రి ఉద్యోగి కాదని రాజాజీ హాస్పిటల్ డీన్ డాక్టర్ ఎంఆర్ వైరముత్తూర్ రాజు తెలిపారు.