: పూర్తి 'అమరావతి'ని నేను కట్టలేను: చంద్రబాబు


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిని పూర్తిగా తాను నిర్మించలేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఏపీలో రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా జెమినీ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను అడ్మినిస్ట్రేటివ్ కాపిటల్ ను మాత్రం సాధ్యమైనంత త్వరగా నిర్మిస్తానని, మౌలిక వసతులు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు. ఆపై పరిశ్రమలు తరలి రావడం, ప్రజల నుంచి అందే సహకారం, ఈ ప్రాంతంలో జరిగే అభివృద్ధిపై ఆధారపడి పూర్తి నగరం నిర్మితం కావాల్సి వుందని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ప్రత్యేక రాష్ట్రం కోసం తెలుగువారు పడ్డ బాధలను వివరించారు. 60 సంవత్సరాల పాటు హైదరాబాద్ ను అభివృద్ధి చేసుకున్న తరువాత హేతుబద్ధత లేకుండా కట్టుబట్టలతో తరిమేశారని విమర్శించారు. రాజధాని లేకుండా, బస్సులో నుంచి పాలన సాగిస్తూ, ప్రజలకు మేలు చేయాలని తాను చూశానని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రూ. 24 వేల కోట్ల రుణమాఫీని తాను చేశానని తెలిపారు. 4 కోట్ల మందికి ప్రతి నెలా సరిపడా బియ్యం ఇస్తున్నామని వివరించారు. ప్రస్తుతం నిత్యమూ కోతలు లేని కరెంటును ఇస్తున్నామని చంద్రబాబు వివరించారు. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసి యావత్ భారతజాతికి ఆదర్శంగా నిలిచామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News