: కేరళలోని ఆ ఇంట్లో ముగ్గురి పేర్లూ ఫిడెల్ క్యాస్ట్రో, చే గువేరా, వాలెంతినా తెరిష్కోవా!
మనదేశంలో సినీ నటులపై అభిమానంతో రామారావు, కృష్ణ, చిరంజీవి, రజనీకాంత్, జయప్రద, జయసుధ, సుహాసిని వంటి పేర్లు పెట్టుకునే వారు చాలా మంది ఉన్నారు. కానీ తమ పిల్లలకి గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి పేర్లు పెట్టుకునేవారిని అత్యంత అరుదుగా చూస్తాం. అలాంటిది ఫిడెల్ క్యాస్ట్రో, చే గువేరా, వాలెంతినా తెరిష్కోవా వంటి పేర్లను పెట్టుకోవడమంటే ఆ ఇంటి యజమానికి చాలా ధైర్యం ఉండాలి. అలాంటి ధైర్యాన్ని కేరళలోని తిరువనంతపురం జిల్లా కజాకొట్టం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి వుంది. అందుకే, తన ముగ్గురు పిల్లలకి ఈ పేర్లు పెట్టారు. దీంతో వారిని స్కూల్లో టీచర్లు వింతగా చూసేశారు. దీనికి తగ్గట్టే కేరళలోని విద్యార్థి ఉద్యమాల్లో చే గువేరా, క్యాస్ట్రో చురుగ్గా పాల్గొనేవారు. చే గువేరా ఓ కంపెనీలో ఉద్యోగం కోసం వెళ్లినప్పుడు నీకు ఉద్యోగం ఇస్తే ఉద్యమాలు చేస్తావా? అని అడిగారట. దానికి ఆయన తడుముకోకుండా ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు ఉద్యమం చేయాల్సి వస్తే చేస్తానని సమాధానమిచ్చాడట. అయినప్పటికీ అతనికి ఉద్యోగం ఇవ్వడం విశేషం. క్యాస్ట్రో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్నప్పటికీ ఆయను అంతా గ్యాస్ట్రో అనుకుంటారు. ఇక వాలెంతినా తెరిష్కోవా (రష్యాకు చెందిన ఈమె మొట్టమొదటి మహిళా వ్యోమగామి) గురించి తెలిసింది తక్కువ మందికే కావడంతో ఆమెకు పెద్దగా ఇబ్బంది లేదు. అయితే కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం అధికారం చేపట్టడంతో వారిప్పుడు అందర్నీ ఆకట్టుకుంటున్నారు.