: ముద్రగడ పాత డిమాండ్లు తీరుస్తున్నాం...తాజా డిమాండ్ తీర్చలేం: చేతులెత్తేసిన చినరాజప్ప
కాపులకు సంబంధించిన అన్ని డిమాండ్లు నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి చినరాజప్ప తెలిపారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, ముద్రగడ అడిగిన కమిషన్ వేయడం, కాపులకు నిధులు కేటాయించడం, విద్యార్థులకు ఉపకారవేతనాలు ఇవ్వడం, కాపు నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రయత్నించడం, లోన్లు అందజేయడం, ఇలా చాలా కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. అయినప్పటికీ ముద్రగడ ఆందోళన చేయడం బాధాకరమని ఆయన చెప్పారు. ఆసుపత్రిలో ఉన్న ముద్రగడ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో కాపులను రెచ్చగొట్టేలా జగన్, చిరంజీవి వంటి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ముద్రగడ తాజా డిమాండ్ ను నెరవేర్చలేమని ఆయన చేతులెత్తేశారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయమని ముద్రగడ కోరుతున్నారని, కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని తాము పరిష్కరించలేమని ఆయన చెప్పారు. వారిని విడుదల చేయడం కుదరదని ఆయన స్పష్టం చేశారు.