: తెలంగాణకు బీజేపీ ఎటువంటి మేలూ చేయలేదు: ఉత్తమ్
తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ఎటువంటి మేలూ చేయలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా సూర్యాపేటలో బీజేపీ నిన్న నిర్వహించిన బహిరంగ సభలో తమ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యల పట్ల ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు ఎటువంటి మేలూ చేయని బీజేపీ నేతలు రాహుల్ గాంధీని విమర్శించడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. అమిత్ షా రాహుల్‌పై చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం అని ఆయన అన్నారు. విభజన చట్టంలో ఒక్క హామీని కూడా కేంద్రం అమలు చేయలేదని ఆయన విమర్శించారు. కాజీపేటలో రైల్వేకోచ్, ఖమ్మంలో ఉక్కు కర్మాగారం హామీలు అమలు కాలేదని ఆయన అన్నారు. విభజన బిల్లులో తెలంగాణకు ప్రయోజనాలు కలిగే అంశాలను యూపీఏ చేర్చిందని ఆయన అన్నారు.