: హిందువుల సంఖ్య తగ్గిపోవడంపై ప్రవీణ్ తొగాడియా వివాదస్పద వ్యాఖ్యలు!
ఉద్రేకపూరిత ప్రసంగాలతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) కీలక నేత ప్రవీణ్ తొగాడియా. గుజరాత్ లోని భరూచ్ జిల్లా జంబూసార్ లో నిన్న హిందువులను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంగా ఆయన మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ పురుషుల్లో ‘ఇంపోటెన్సీ’ (లైంగిక సామర్ధ్యం) నానాటికి తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన సభకు హాజరైన హిందువులకు ఓ సలహా కూడా చేశారు. ‘ఇంటికెళ్లండి... మగతనానికి పూజలు చేయండి’’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. హిందూ పురుషుల్లో ఇంపోటెన్సీ పెరిగిపోతున్న కారణంగా పిల్లల సంఖ్య కూడా తగ్గిపోతోందని తొగాడియా ఆందోళన వ్యక్తం చేశారు. నానాటికి పెరుగుతున్న ముస్లిం జనాభాకు దీటుగా హిందువుల సంఖ్య పెరగాల్సి ఉందని చెప్పిన ఆయన మరింత మంది పిల్లలను కనాలని కూడా సూచించారు. లైంగిక పటుత్వం తగ్గిపోవడానికి కారణంగా ధూమపానాన్ని ప్రస్తావించిన తొగాడియా... తక్షణమే ఆ చెడు అలవాటును మానేయాలని పిలుపునిచ్చారు. ఇక లైంగిక పటుత్వాన్ని పెంచేందుకు తానో మందును తయారు చేశానని చెప్పిన ఆయన... రూ.600 విలువ కలిగిన సదరు మందును రూ.500లకే ఇవ్వనున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. అన్నట్టు సర్జికల్ ఆంకాలజీలో ఎమ్మెస్ చేసిన తొగాడియా కొన్నాళ్లు డాక్టర్ గా ప్రాక్టీస్ కూడా చేశారు.