: దాడుల సమయంలో పాక్ ఆతిథ్యంపై నోరువిప్పిన హోం శాఖ మాజీ కార్యదర్శి గుప్తా


2008లో ముంబైపై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భీకర దాడులు చేసిన సమయంలో ఆ దేశ ఆతిథ్యం స్వీకరించారన్న సంచలన కథనాలపై కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి మధుకర్ గుప్తా ఎట్టకేలకు నోరు విప్పారు. ఇరు దేశాల మధ్య చర్చల నేపథ్యంలో పాక్ రాజధాని ఇస్లామాబాదు వెళ్లిన సందర్భంగా అక్కడ మరో రోజు పాటు ఉండాల్సి రావడం, అందులోనూ పాక్ అధికారులు తమకు పర్వత పట్టణం ముర్రీలో వసతి కల్పించిన వైనంతో కాస్తంత ఇబ్బందికి గురయ్యామని ఆయన కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో ‘ఏఎన్ఐ’ వార్తా సంస్థకు చెప్పారు. అయితే దాడులకు ఎలాంటి ఆటంకం లేకుండా చేసేందుకే పాక్ తమను ముర్రీకి తరలించిందన్న విషయం తమకు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఓ వైపు ముంబైలో మారణహోమం జరుగుతుంటే... తాము మాత్రం పాక్ ఇచ్చిన పార్టీలో మునిగిపోయామన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. మరో రోజు అక్కడ ఉండాల్సి రావడంతో పాక్ అధికారులు ఏర్పాటు చేసిన బసకు మాత్రమే తాము వెళ్లామని ఆయన పేర్కొన్నారు. ఇక ముర్రీలో సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేవన్న వాదనను కూడా మధుకర్ కొట్టిపారేశారు. దాడులు జరిగిన వెంటనే భారత్ నుంచి తమ శాఖకు చెందిన ఓ అధికారి తన సెల్ కు ఫోన్ చేసి సమాచారం అందించారన్నారు. వెనువెంటనే తాను టీవీ ఆన్ చేసి దాడులను నిర్ధారించుకున్నానని తెలిపారు. ఇక ఉగ్రవాదులపై కౌంటర్ అటాక్ ఆలస్యం కావడానికి తాను అందుబాటులో లేకపోవడమే కారణమన్న విషయాన్ని కూడా గుప్తా కొట్టిపారేశారు. అప్పటికే తమ శాఖలోని కంట్రోల్ రూంలో ఉన్న అధికారి... ముంబై వెళ్లారని ఎన్ఎస్జీ కమెండోలకు ఆదేశాలు జారీ చేశారని ఆయన చెప్పారు. ఎన్ఎస్జీ కమెండోలు ముంబైకి చేరుకునే సరికి ఆలస్యమైంది తప్పించి, తాను అందుబాటులో లేకపోవడం అసలు కారణమే కాదని కూడా గుప్తా చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News