: భారత రాజకీయాల్లోకి మరో ‘ఇందిర’... ప్రియాంకా గాంధీ పొలిటికల్ ఎంట్రీకి సర్వం సిద్ధం


బారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మనవరాలు... ఆమెకు ప్రతిరూపంగా ప్రజలు భావిస్తున్న ప్రియాంకా గాంధీ రాజకీయ తెరంగేట్రానికి రంగం సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది దేశంలో కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను 2019 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా అధికార బీజేపీ భావిస్తోంది. సాధ్యమైనన్ని సీట్లు సాధించడమే కాకుండా ఆ రాష్ట్ర అధికార పగ్గాలను కూడా చేజిక్కించుకునేందుకు కమల దళం వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ నేపథ్యంలో మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు యూపీ అసెంబ్లీ ఎన్నికలనే ఆ పార్టీ కూడా అస్త్రంగా భావిస్తోంది. ఇప్పటికే పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆశించిన మేర ఫలితాలు రాబట్టని నేపథ్యంలో ప్రియాంకా గాంధీని బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ దాదాపుగా నిర్ణయించుకుంది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఈ ప్రతిపాదనకు పచ్చజెండా ఊపడంతో... యూపీ ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ ప్రచార బాధ్యతలను భుజాన వేసుకునేందుకు సిద్ధమయ్యారు. అంతేకాకుండా 2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుతం రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ నుంచి ఆమె ఎన్నికల బరిలోకి దిగడం ఖాయమేనన్న ప్రచారమూ సాగుతోంది. నానమ్మ రూపు రేఖలను పుణికిపుచ్చుకున్న ప్రియాంకా గాందీ...దేశ రాజకీయాల్లో మరో ‘ఇందిర’లా అవతరించడం ఖాయమేనన్న విశ్లేషణలూ సాగుతున్నాయి.

  • Loading...

More Telugu News