: ముంబై తగలబడిపోతుంటే... పాక్ ఆతిథ్యంలో తరించిన కేంద్ర హోం శాఖ కార్యదర్శి
అది 2008, నవంబర్ 26. భారత వాణిజ్య రాజధాని ముంబైపై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులు సహా 178 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు, 308 మందిని గాయపరిచారు. నేటికీ ఈ దాడిని తలచుకుంటే వెన్నులో వణుకు పుట్టక మానదు. సముద్ర మార్గం మీదుగా గుట్టుచప్పుడు కాకుండా ముంబైలో అడుగుపెట్టిన అజ్మల్ కసబ్ సహా 10 మంది ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. అదే సమయంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి, ఇతర అధికారులు పాకిస్థాన్ ఆతిథ్యంలో తరించారు. ఈ ఆసక్తికర ఘటన తాజాగా వెలుగుచూసింది. ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నేటి తన సంచికలో ఈ ఆసక్తికర కథనాన్ని ప్రముఖంగా రాసింది. వివరాల్లోకెళితే... 2008, నవంబర్ 26న భారత్, పాక్ హోం శాఖ కార్యదర్శుల స్థాయి చర్చలు జరిగాయి. పాక్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన ఈ భేటీకి నాటి కేంద్ర హోం శాఖ కార్యదర్శి మధుకర్ గుప్తా ఆ శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులతో కలిసి పాక్ వెళ్లారు. 26 సాయంత్రానికే చర్చలు ముగిశాయి. అయితే వెనువెంటనే భారత్ బయలుదేరాల్సిన మధుకర్ గుప్తా... మరునాటి వరకు అక్కడే ఉండేందుకు నిర్ణయించుకున్నారు. పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి (హోం మంత్రి)తో భేటీ నిమిత్తమే మధుకర్ గుప్తా అక్కడ ఉండాల్సి వచ్చింది. చర్చల సందర్భంగా అందుబాటులో లేని పాక్ మంత్రి మరునాడు మధుకర్ గుప్తా బృందంతో భేటీ అవుతానని చెప్పారు. ఇదే విషయాన్ని నాటి హోం శాఖ మంత్రి శివరాజ్ పాటిల్ తో పాటు ఇతర అధికారులకు తెలిపిన మధుకర్ గుప్తా... ఆ రోజు రాత్రి పాక్ లోనే బస చేసేందుకు అనుమతి తీసుకున్నారు. ఈ క్రమంలో మధుకర్ గుప్తా బృందాన్ని పర్వత ప్రాంతం ముర్రీకి తరలించిన పాక్ అధికారులు అక్కడి ఓ లగ్జరీ హోటల్ లో ఆతిథ్యం ఇచ్చారు. అయితే అదే రోజు రాత్రి 8 గంటల సమయంలో కసబ్ బృందం ముంబైపై విరుచుకుపడింది. భారత్ నుంచి ఉగ్రవాదులకు తక్షణ కౌంటర్ అటాక్ ఎదురుకాకూడదన్న భావనతోనే పాక్ అధికారులు మధుకర్ గుప్తా బృందాన్ని ఆ రోజంతా తమ భూభాగంలోనే ఉంచేందుకు ఈ పన్నాగం పన్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఉగ్రవాద దాడులపై వేగంగా స్పందించాలంటే హోం శాఖ కార్యదర్శి అందుబాటులో ఉండాల్సిందే. అయితే మధుకర్ గుప్తా పాక్ లో... అది కూడా సెల్ ఫోన్ సిగ్నల్స్ అందని పర్వత ప్రాంతంలో పాక్ అతిథ్యంలో ఉండిపోవడంతో ఉగ్రవాదులపై కౌంటర్ అటాక్ కాస్తంత ఆలస్యంగా జరిగిందన్న వాదన వినిపిస్తోంది. పర్వత ప్రాంతం నుంచి పాక్ అతిథ్యం ముగించుకున్న మధుకర్ గుప్తా... ఆ మరునాడు (నవంబర్ 27న) ఇస్లామాబాద్ లో ఆ దేశ అంతర్గత వ్యవహారాల కార్యదర్శితో భేటీ అయి నిర్దేశిత సమయాని కంటే కాస్త ముందుగా బయలుదేరారు. అయినా దాడులు జరిగిన మరునాడు మధ్యాహ్నానికి గాని మధుకర్ గుప్తా ఢిల్లీకి చేరుకోలేకపోయారు. దేశవ్యాప్తంగా ఈ సంచలన కథనం కలకలం రేపే అవకాశాలున్నాయి.