: పోనీ టెయిల్ ఉందని ఎల్కేజీ బాలుడిని బహిష్కరించిన బెంగళూరు స్కూల్


దేశంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు వెర్రి వేషాలు వేస్తున్నాయి. అసంబద్ధ కారణాలు చూపుతూ చిన్నారులకు విద్యను నిరాకరిస్తున్నాయి. ఈ తరహా ఘటన ఎలక్ట్రానిక్ సిటీగా పేరుగాంచిన కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇటీవల చోటుచేసుకుంది. పోనీ టెయిల్ ఉన్న మూడున్నరేళ్ల బాలుడికి చదువు చెప్పేందుకు ఆ నగరంలోని ఓ పాఠశాల ససేమిరా అంది. ‘‘మా బడిలో చదవాలంటే... పోనీ టెయిన్ తీసేయండి, లేదంటే లేదు’’ అంటూ ఆ పాఠశాల ప్రిన్సిపల్ బాలుడి తండ్రికి నిర్మొహమాటంగా చెప్పేశాడు. అది తమ కుటుంబ ఆచారానికి విరుద్ధమంటూ ఆ బాలుడి తండ్రి ప్రాధేయపడ్డా, కాళ్లా వేళ్లా పడ్డా కూడా ఆ ప్రిన్సిపల్ మనసు కరగలేదు. అప్పటికే చెల్లించిన రూ.43 వేలను వెనక్కిచ్చేసి మరీ ఆ చిన్నారి బాలుడికి చదువు చెప్పేది లేదని కరాఖండిగా చెప్పాడు. దీంతో చేసేది లేక వేరే పాఠశాలలో అయినా చేరుద్దామంటూ ఆ బాలుడి తండ్రి చేసిన యత్నాలు ఫలించలేదు. అప్పటికే అడ్మిషన్ల గడువు ముగియడంతో ఇక ఆ బాలుడు వచ్చే ఏడాది దాకా స్కూల్ కు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ పాఠశాలల కఠిన నియమాలకు నిదర్శనంగా నిలిచిన ఈ ఘటన వివరాల్లోకెళితే... బెంగళూరులోని బాబూసాబ్ పాల్యాకు చెందిన మంజునాథ్ బీసీ... తన మూడున్నరేళ్ల కుమారుడు విష్ణు బీఎంను బనస్ వాడీ మెయిన్ రోడ్డులోని సెయింట్ విన్సెంట్ పల్లొట్టి స్కూల్ లో చేర్చాడు. ఇందుకోసం మంజునాథ్ అప్పటికే రూ.43 వేలను చెల్లించారు. ఈ నెల 6న తన కొడుకును తీసుకొచ్చేందుకు స్కూల్ వద్దకెళ్లిన మంజునాథ్ కు పాఠశాల ప్రిన్సిపల్ పాల్ డిసౌజా షాకిచ్చే వార్త చెవిన వేశాడు. విష్ణుకు పోనీ టెయిల్ ఉందని, పోనీ టెయిల్ తో బాలురు పాఠశాలకు వచ్చేందుకు తమ నియమాలు అనుమతించవని డిసౌజా చెప్పారు. తక్షణమే పోనీ టెయిల్ తీసేసి విష్ణును స్కూల్ కు పంపాలని ఆదేశించారు. అయితే తమ కుటుంబ ఆచారం మేరకు ఐదేళ్లు నిండేదాకా పుట్టెంట్రుకలు తీయడం కుదరదని మంజునాథ్ చెప్పాడు. దీంతో చిర్రెత్తిన డిసౌజా... పోనీ టెయిల్ తీస్తేనే విష్ణును స్కూల్లోకి అనుమతిస్తామని తేల్చి చెప్పాడు. అయితే కుటుంబ ఆచారాన్ని ఎలా అతిక్రమించేదంటూ మంజునాథ్ ప్రాధేయపడ్డా డిసౌజా మనసు కరగలేదు. మంజునాథ్ చెల్లించిన రూ.43 వేలను తిరిగి ఇచ్చేసిన డిసౌజా... విష్ణుకు చదువు చెప్పలేమంటూ కరాఖండిగా చెప్పాడు. చేసేది లేక మంజునాథ్ నిరాశగా వెనుదిరిగారు. కొడుకు విద్యాభ్యాసంపై అమితాసక్తి ఉన్న మంజునాథ్.. ఆ తర్వాత పలు పాఠశాలలు తిరిగాడు. అయితే అప్పటికే అడ్మిషన్ల గడువు ముగియడంతో ఎక్కడా విష్ణుకు సీటు దొకరలేదు. దీంతో పాఠశాలకెళ్లాలంటే తన కొడుకు ఓ ఏడాది పాటు ఆగక తప్పని పరిస్థితి నెలకొందని మంజునాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News