: గుజరాత్ ముఖ్యమంత్రిని కన్నీరు పెట్టించిన చిన్నారి కల్పిత లేఖ!
భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలను చూసినప్పుడు లేదా విన్నప్పుడు గుండె బరువెక్కుతుంది. అయితే, తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని అంబికా గోహెల్ అక్కడి వారినందరినీ ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లి, కంటతడి పెట్టించిన ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. వివారాల్లోకి వెళ్తే...గుజరాత్ లో భ్రూణ హత్యలు సర్వసాధారణం. ఆడపిల్ల కడుపులో పడిందని తెలిసిన మరుక్షణం నుంచి ఆ మహిళ జీవితం కష్టమైపోతుంది. అబార్షన్ చేయించేస్తారు. ఒకవేళ పొరపాటున ఆడబిడ్డ పుడితే కనుక ఆమె ఛీదరింపుల మధ్య బతకాల్సిందే. ఈ నేపథ్యంలో, భ్రూణహత్యకు గురైన ఓ పసికందు తన తల్లికి తన ఆవేదనను తెలుపుతూ రాసిన ఓ కల్పిత లేఖను అంబిక సభలో చదివి వినిపించింది. చదవడం పూర్తయ్యేసరికి సభలో ఉన్న స్కూలు విద్యార్థినులతో పాటు మహిళలంతా ఏడ్చారు. వేదికపై ఉన్న సీఎం అనందీబెన్ పటేల్ కూడా కన్నీటిపర్యంతమయ్యారు. లేఖ చదవడం పూర్తికాగానే... ఏడుస్తున్న అంబికను పిలిచి గుండెలకు హత్తుకుని, పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నావని అడిగారు. దీనికి డాక్టర్ కావాలని ఉందని, భ్రూణ హత్యలు ఆపాలని ఉందని బాలిక చెప్పడంతో అక్కడి వారి గుండె మరింత బరువెక్కింది.