: నాన్న వయసు పెరుగుతోందంటే నమ్మశక్యంగా లేదు: బాలకృష్ణ తనయ బ్రాహ్మణి
తన తండ్రికి 56 ఏళ్లు పూర్తయ్యాయంటే నమ్మశక్యంగా లేదని ప్రముఖ నటుడు బాలకృష్ణ కుమార్తె, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోడలు నారా బ్రాహ్మిణి తెలిపారు. హైదరాబాదులోని బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం తన తండ్రి అమెరికాలో ఉన్నారని అన్నారు. తన తాతగారు దివంగత ఎన్టీఆర్ చెప్పిన 'మానవ సేవే మాధవ సేవ' అనే సూక్తిని తన తండ్రి ఆచరిస్తారని ఆమె తెలిపారు. సేవే పరమావధిగా బసవతారకం ట్రస్ట్ కేన్సర్ ఆసుపత్రిని నడిపిస్తున్నారని ఆమె చెప్పారు. తన కుమారుడు దేవాన్ష్ తో ఆడుకుంటే తన తండ్రి చిన్నపిల్లాడిగా మారిపోతారని, అది చూస్తే తనకు చాలా ముచ్చటేస్తుందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.