: ఇప్పటికైనా ముద్రగడ తన దీక్షను విరమించాలి!: మంత్రి నారాయణ సూచన
కాపు నేత ముద్రగడ పద్మనాభం తాను చేస్తోన్న దీక్షను ఇప్పటికైనా విరమించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ సూచించారు. ఈరోజు విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. కాపుల అభివృద్ధి, సంక్షేమం కోసం ఐదు వేల కోట్ల రూపాయలు ఇస్తామన్నామని, ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలను బడ్జెట్లో ప్రవేశపెట్టామని ఆయన గుర్తు చేశారు. కాపుల రిజర్వేషన్ అంశం ఇప్పటి సమస్యకాదని, చాలా కాలం నుంచి ముద్రగడ పోరాడుతున్నారని ఆయన అన్నారు. అయితే, కాపులని ముద్రగడ కలుపుకొని పోరాడలేదని నారాయణ వ్యాఖ్యానించారు. ముద్రగడ అందర్నీ కలుపుకొని పోరాడి ఉంటే కాపుల డిమాండ్లు ఎప్పుడో నెరవేరేవని ఆయన అన్నారు. ముద్రగడ ఏకపక్ష నిర్ణయం తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఆయన ఏక పక్షనిర్ణయాల వల్లే కాపులను ప్రభుత్వాలు బీసీల్లో చేర్చలేకపోతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కాపులని తాము కచ్చితంగా బీసీల్లో చేర్చుతామని ఈ అంశంపైనే చట్టబద్ధంగా తాము కృషి చేస్తున్నామని నారాయణ చెప్పారు. దీక్షను విరమించాలని ఆయన ముద్రగడకు సూచించారు.