: హైదరాబాద్‌లో యాచకుల సంపాదన నెలకు రూ.2 కోట్లు!
హైదరాబాద్‌లో యాచకులు పెరిగిపోతున్నారు. వారి సంపాదన కూడా అదే స్థాయిలో పెరిగిపోతోంది. నగరంలోని ఏ కూడళ్లలో చూసినా యాచకులు తప్పని సరిగా కనిపిస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఏ సమయంలోనైనా కూడళ్ల వద్ద సిగ్నల్ పడి మన వాహనాన్ని కాసేపు ఆపితే చాలు యాచకులు వాహనదారులను విసిగిస్తూ డబ్బులడిగే దృశ్యాలు కనిపిస్తాయి. ఇక ప్రార్థనా మందిరాల వద్ద కూడా యాచకులు కనపడడం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో, నగరంలో యాచకులంతా కలసి రాబట్టే ఆదాయం నెలకి రెండు కోట్ల రూపాయలుగా ఉందట. ఈ విషయాన్ని నగర మేయర్ బొంతు రామ్మోహన్ మీడియాతో చెప్పారు. ఈ లెక్కన హైదరాబాద్‌లో యాచకులు ఏడాదికి రూ.24 కోట్లు సంపాదిస్తున్నారట. హైదరాబాద్‌లో ఉన్న యాచకుల్లో ఏ గతీ లేక బెగ్గర్లుగా మారిన వారు కేవలం 2 శాతమేనట. మిగతా వారంతా ఈ వృత్తిలోకి దానిని ఒక వ్యాపారంగా తీసుకుని దిగారట. హైదరాబాద్‌లో యాచకులను లేకుండా చేసే అంశంపై చర్చించడానికి ఈనెల 23న జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులు సమావేశం కానున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో యాచకవృత్తిని నేరంగా పరిగణిస్తారన్న విషయం తెలిసిందే. రోడ్డుపై ఎవరైనా అడుక్కుంటూ కనిపిస్తే వారికి శిక్షలు కూడా వేస్తారు.