: హ్యాపీ రిసార్ట్స్ లో నేడు కాపు సభ!... ముద్రగడ అరెస్ట్ నేపథ్యంలో కీలక చర్చ!
కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష భగ్నం, అరెస్ట్ నేపథ్యంలో తదనంతర పరిణామాలపై నేడు కీలక భేటీ జరగనుంది. గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలోని హ్యాపీ రిసార్ట్స్ లో నేడు మధ్యాహ్నం 3 గంటలకు కాపు సభను నిర్వహించేందుకు ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన కాపు నేతలు హాజరు కానున్న ఈ సభకు ఆ సామాజిక వర్గానికి చెందిన ఏపీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, నారాయణ, గంటా శ్రీనివాసరావు, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ తదితర కీలక నేతలు పాల్గొననున్నారు. ముద్రగడ అరెస్ట్ తర్వాత కాపుల్లో నెలకొన్న అయోమయ స్థితికి చెక్ పెట్టేందుకే ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. కాపుల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు, భవిష్యత్తులో చేపట్టనున్న చర్యలపై ఈ సమావేంలో మంత్రులు కాపు నేతలకు వివరించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాపుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై ముద్రగడ సహా విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లోని వాస్తవ పరిస్థితులపైనా ఈ భేటీలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.