: న్యాయవాదుల కోసం ముద్రగడ నివాసం వద్ద పోలీసులు, కాపు సంఘం నేతల నిరీక్షణ
కిర్లంపూడిలో కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్ష ప్రాంతంలో కాపునేతలు, పోలీసులు న్యాయవాదుల రాక కోసం ఎదురుచూస్తున్నారు. ముద్రగడ ఆమరణ నిరశన కొనసాగిస్తోన్న నేపథ్యంలో ఏలూరు రేంజ్ డీఐజీ రామకృష్ణ, జిల్లా ఎస్పీ రవిప్రకాష్ అక్కడికి చేరుకున్నారు. కొద్దిసేపు పోలీసులకి, అక్కడి కాపునేతలకి మధ్య వాగ్వివాదం జరిగింది. ముద్రగడను అరెస్టు చేయాలని చూసిన పోలీసులతో, తనను అదుపులోకి తీసుకోవడానికి తగిన కారణాలు చూపించాలని ముద్రగడ వాదించారు. ఈ క్రమంలో సీబీసీఐడీ పోలీసులు తమ వద్ద ఉన్న పలు పత్రాలను చూపించారు. అయితే, వాటిని తమ న్యాయవాదులకు చూపించి ఆ తరువాత అరెస్టు చేయాలని కాపునేతలు పోలీసులతో అన్నారు. న్యాయవాదులు అక్కడికి వచ్చి ముద్రగడ అరెస్టు కోసం తెచ్చిన పత్రాలను పరిశీలించుకోవచ్చని పోలీసులు చెప్పారు. దీంతో న్యాయవాదుల కోసం ఎదురుచూస్తున్నారు.