: అధికారులకు ఝలక్కిచ్చిన బుగ్గన!... పీఏసీని ఆషామాషీగా పరిగణించవద్దని వార్నింగ్!
వైసీపీ యువనేత, ఏపీ ప్రజాపద్దుల సంఘం (పీఏసీ) చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిన్న ఆ రాష్ట్ర అధికారులకు ఝలక్కిచ్చారు. పీఏసీని ఆషామాషీగా పరిగణించవద్దని ఆయన ఓ రేంజిలో హెచ్చరికలు జారీ చేశారు. వివరాల్లోకెళితే.. నిన్న హైదరాబాదులోని అసెంబ్లీ ప్రాంగణంలో పీఏసీ సమావేశం బుగ్గన అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి పలు శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గృహనిర్మాణం, ఎక్సైజ్ శాఖలకు సంబంధించిన వివరాలు కావాలని బుగ్గన అడిగారు. అయితే సదరు సమాచారం ప్రస్తుతం అందుబాటులో లేదని, సమాచారం అందజేతకు కొంత సమయం కావాలని ఆ శాఖల అధికారులు కోరారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బుగ్గన... సమావేశానికి వచ్చేటప్పుడు సమగ్ర సమాచారంతో రాకపోతే ఎలాగని అధికారులను నిలదీశారు. పీఏసీని ఆషామాషీగా పరిగణించవద్దని ఆయన వార్నింగిచ్చారు.