: ‘ఓటుకు నోటు’ శకం ముగిసింది!: జెరూసలేం మత్తయ్య కీలక వ్యాఖ్య!
ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆరని చిచ్చును రగిల్చింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యేల ఓట్లను కొనుగోలు చేసే క్రమంలో టీ టీడీపీ యువనేత, ప్రస్తుతం టీ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి అడ్డంగా బుక్కయిన సంగతి తెలిసిందే. ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డే అయినప్పటికీ ఈ కేసులో మధ్యవర్తిత్వం నెరపిన క్రైస్తవ సంఘాల నేత జెరూసలేం మత్తయ్య కీలక నిందితుడు. తెలంగాణ పోలీసులకు ఝలక్కిచ్చిన మత్తయ్య ఏపీకి మకాం మార్చి హైకోర్టు నుంచి అరెస్ట్ భయం లేదంటూ హామీ వచ్చిన తర్వాతే హైదరాబాదులో అడుగుపెట్టారు. ఈ క్రమంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలన్న ఆయన పిటిషన్ పై సానుకూలంగా స్పందించిన హైకోర్టు మత్తయ్యపై కేసును కొట్టేసింది. ఈ క్రమంలో నిన్న హైదరాబాదులో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మత్తయ్య ఈ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసును పూర్తిగా ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. తనపై కేసు కొట్టివేసిన మరుక్షణమే ఈ కేసు శకం ముగిసిందని ఆయన వ్యాఖ్యానించారు. విపక్ష పార్టీ ఓటేయాలంటూ తనకు భారీగా ముడుపులు ఎరవేశారన్న నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్ ఆరోపణలు అబద్ధాలని తేలిపోయిందని కూడా మత్తయ్య పేర్కొన్నారు.