: కుటుంబం ప్రాణాలు తీయబోయిన తప్పుడు హెచ్ఐవీ రిపోర్ట్!
ప్రాథమిక ఆసుపత్రి సిబ్బంది చేసిన తప్పు ఓ కుటుంబాన్ని బలితీసుకోబోయింది. ఆఖరు క్షణంలో బంధువుల చొరవతో ఆ నిండు కుటుంబం బతికి బట్టకట్టింది. లేకుంటే పెను ప్రమాదమే జరిగి ఉండేది. వివరాల్లోకి వెళ్తే...పశ్చిమ బెంగాల్ కు చెందిన దంపతులు నల్గొండ జిల్లా చుండూరు మండల కేంద్రానికి చాలా కాలం క్రితం వలస వచ్చారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టి జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకుడి భార్య గర్భందాల్చింది. దీంతో ఈ నెల 1న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వివిధ పరీక్షలు చేయించుకుంది. ఈ పరీక్షల్లో హెచ్ఐవీ ఉన్నట్టు తేలిందని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. అయితే తదుపరి పరీక్షలు జిల్లా కేంద్రంలో చేయించుకోవాలని సూచించారు. హెచ్ఐవీ రిపోర్టు విని నిర్ఘాంతపోయిన ఆ కుటుంబ సభ్యులు ఇంత అవమానం భరించలేమని, చచ్చిపోదామని నిర్ణయించుకున్నారు. ట్రైన్ కింద పడి చచ్చిపోయేందుకు వారు రైల్వేస్టేషన్ కు వెళ్లారు. అయితే వారి బంధువులకు ఎందుకో వారి ప్రవర్తనపై అనుమానం వచ్చి, ఫోన్ లో వారిని బతిమాలి, ఇంటికి రప్పించి కౌన్సిలింగ్ ఇచ్చారు. వారి ఒత్తిడితో ఆ దంపతులు జిల్లా కేంద్రంలో హెచ్ఐవీ పరీక్షలు చేయించుకున్నారు. ఈ సారి వారికి హెచ్ఐవీ లేదని రిపోర్టులు వచ్చాయి. దీంతో వారు పరిచయస్తులకు వివరించగా, వీరిని స్థానిక నాయకుల దగ్గరకు తీసుకెళ్లారు. వీరంతా కలిసి ఆసుపత్రికి వెళ్లి వైద్యురాలిని నిలదీయగా, సిబ్బంది ఇచ్చిన రిపోర్టును తాను బాధితులకు చెప్పానని, అనుమానం రావడంతోనే జిల్లా కేంద్రానికి వెళ్లమని చెప్పానని వివరణ ఇచ్చారు.