: గర్ల్ ఫ్రెండ్ కోసం దొంగతనం చేసి పట్టుబడ్డ సాఫ్ట్ వేర్ ఇంజనీర్!


గర్ల్ ఫ్రెండ్ గొంతెమ్మ కోరికలు తీర్చేందుకు దొంగగా మారిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...థౌజండ్ లైట్స్ ఏరియాకి చెందిన కార్తికేయన్ (24) పాత మహాబలిపురం రోడ్డులోనున్న ఐటీ కంపెనీలో సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్‌ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సర్దార్ పటేల్ రోడ్డులోని గాంధీమండపం ముందున్న బస్టాప్‌ కు దగ్గర్లో తన బైక్ పార్క్ చేశాడు. అనంతరం కొట్టూర్‌ పురం వెళ్లేందుకు బస్‌ కోసం ఎదురు చూస్తున్న వాసంతి (42) అనే మహిళ వద్దకెళ్లిన కార్తికేయన్, అడ్రస్ అడుగుతున్న వాడిలా నటించి, ఆమె మెడలో ఉన్న చైన్‌ లాక్కుని బైక్ వద్దకు పరుగెట్టాడు. దీంతో ఆమె పెద్దగా అరుస్తూ కేకలు వేసింది. ఇంతలో బస్టాప్ దగ్గర పార్క్ చేసిన అతని బైక్ ఎంతకూ స్టార్ట్ కాలేదు. దీంతో అటుగా వస్తున్న పోలీసులు ఆమె కేకలు విని కార్తికేయన్ ను పట్టేశారు. దీంతో అతనిని విచారించగా, తన గర్ల్ ఫ్రెండ్‌ కోరిక తీర్చేందుకే దొంగతనం చేశానని చెప్పాడు. సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్‌ గా సంపాదిస్తున్నప్పటికీ, ఆమె గొంతెమ్మ కోర్కెలు తీర్చడం కోసం దొంగగా మారానని తెలిపాడు. ఇంతకీ ఈ ఘటనలో ఫినిషింగ్ టచ్ ఏమిటంటే, కార్తికేయన్ కొట్టేసిన చైన్ రోల్డ్ గోల్డ్ ది కావడం! అయినా సరే పోలీసులు తమ విధి తాము నిర్వర్తిస్తూ అతనిపై కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News