: భారత్ లో దాడులకు ఐఎస్ఐఎస్ కుట్ర... లోకల్ గ్రూప్ లతో దోస్తీ?
ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తున్న ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు భారత్ లో విధ్వంసానికి కుట్రలు పన్నుతున్నారు. అమెరికా, ఐరోపా, ఆఫ్రికాల్లో దాడులకు పాల్పడుతూ, అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం ద్వారా తమ ఉనికిని చాటుకుని, ఆందోళన రేకెత్తిస్తున్న ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు భారత్ లో మాత్రం ప్రవేశించలేకపోయారు. దీంతో భారత్ లో ఎలాగైనా పాగా వేయాలని చాలా కాలంగా వీడియోలు విడుదల చేస్తూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, భద్రతా దళాలు ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతుండడంతో వారి పప్పులు ఉడకడం లేదు. దీంతో ఇలాగే ఉంటే భారత్ లో ప్రవేశం తమ వల్ల కాదని భావించిన ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు, ముందు విధ్వసం సృష్టించి, ఉనికిని చాటుకుని, ఆ తరువాత ప్రవేశిస్తే బాగుంటుందని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ లో ఇప్పటికే సానుభూతిపరులను సమకూర్చుకున్న లష్కరే తోయిబా, ఇండియన్ ముజాహిదీన్ వంటి తీవ్రవాద సంస్థల సాయంతో పెను విధ్వంసానికి ప్లాన్ వేశారు. ఈ మేరకు నిఘా విభాగాలకు సమాచారం ఉండడంతో వారు అప్రమత్తమయ్యారు. ఎక్కడ? ఎప్పుడు? ఎలా? వేటితో? దాడి చేయాలన్న రోడ్ మ్యాప్ తయారు చేసి, ఇతర సంస్థల తీవ్రాదులకు పక్కా ప్లాన్ ను అందజేయడం ద్వారా దాడులకు పాల్పడాలన్నది ఐఎస్ఐఎస్ వ్యూహం. ఇలా దాడులు చేసిన వారికి పెద్దమొత్తం అందజేయడం ద్వారా భారత్ లో ప్రవేశం, వేళ్లూనుకోవడం వంటివి సాధ్యమవుతాయని ఐఎస్ఐఎస్ భావిస్తున్నట్టు నిఘా వర్గాలు భావిస్తున్నాయి.