: విభజన సమయంలో టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో కలుపుతామన్నారు.. కానీ మాటమార్చేశారు!: చంద్రబాబు
రాష్ట్ర విభజన సమయంలో ఆనాటి ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కడపలో నిర్వహిస్తోన్న మహా సంకల్ప యాత్రలో ఆయన మాట్లాడుతూ.. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడాలంటూ ఎన్నో ప్రయత్నాలు చేశామని ఆయన అన్నారు. చీకటి గదిలో అరగంటలో అన్యాయంగా రాష్ట్రాన్ని విడగొట్టారని, దాంతో ఏపీ నష్టపోయిందని ఆయన అన్నారు. ‘విభజన సమయంలో తెలంగాణలో కేసీఆర్ చెప్పారు.. తమ టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో కలుపుతామని. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసు.. తెలంగాణ ఏర్పడ్డాక మాట మార్చేశారు’ అని ఆయన వ్యాఖ్యానించారు. మరో వైపు అదే సమయంలో జైలు నుంచి జగన్మోహన్ రెడ్డిని విడుదల చేసి తెలుగుదేశం పార్టీ పైకి పోటీగా తీసుకొచ్చారని చంద్రబాబు అన్నారు. రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ఎన్నో కుట్రలు చేసినా చివరికి ఆ పార్టీకి చేదు ఫలితమే వచ్చిందన్నారు. భవిష్యత్తులోనూ కోలుకోలేని విధంగా కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు బుద్ధి చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా కేంద్రాన్ని కోరుతూనే ఉన్నామని ఆయన అన్నారు. హైదరాబాద్‌ని కేవలం 9 ఏళ్లలో అభివృద్ధి చేశామని ఆయన పేర్కొన్నారు. ‘హైదరాబాద్‌ని నాలెడ్జ్ సిటీగా మార్చాం, ప్రపంచ పటంలో పెట్టాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజించారు. ఆంధ్రజాతికి మొదట్నుంచీ అన్యాయం జరుగుతూనే ఉంది’ అని ఆయన అన్నారు.