: ఈరోజు చేసిన ప్రతిజ్ఞ ప్రతి ఒక్కరి గుండెలో గుర్తుండిపోవాలి!: కడపలో చంద్రబాబు
రాష్ట్రమంతటా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రజలు ‘మహా సంకల్పం’ తీసుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కడపలో మహా సంకల్ప యాత్ర వేదికపై ఆయన మాట్లాడారు. వేదికపై నుంచి రాష్ట్ర ప్రజల చేత రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన ‘మహా సంకల్పం’ ప్రతిజ్ఞ చేయించారు. ఈరోజు చేసిన ప్రతిజ్ఞ ప్రతి ఒక్కరి గుండెల్లో గుర్తుండి పోవాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఎన్నో కష్టాలున్నాయని, ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ వెళుతున్నామని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ రంగంలో రెండేళ్లలో సాధించిన విజయాలపై చంద్రబాబు వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో తొలిసారి 24 గంటల విద్యుత్తును అందిస్తున్నామని చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఆయువుపట్టయిన విద్యుత్ రంగంలో సాధించిన విజయాలను ప్రజలకు అంకితం ఇస్తున్నానన్నారు. కరెంటు సౌకర్యంలేని ఎన్నో ప్రాంతాలకు విద్యుత్తు సరఫరాను ప్రారంభించామని అయన తెలిపారు. మారుమూల గ్రామాల్లో సైతం విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని తెలిపారు. విద్యుత్ కొరతను చాలా వరకు అధిగమించేశామని ఆయన తెలిపారు. విద్యుత్ ఛార్జీల భారాన్ని రైతులపై పడకుండా చూస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు.