: నాలుగేళ్ల అనంతరం సిమ్లాకు విమాన సర్వీసులు
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాకు విమాన సర్వీసులు నడపటం లాభసాటిగా లేదని విమానయాన సంస్థలు భావించడంతో, సుమారు నాలుగేళ్ల క్రితం ఇక్కడికి ఆయా సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే, రేపటి నుంచి అక్కడికి మళ్లీ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సుధీర్ శర్మ మాట్లాడుతూ, సిమ్లా సమీపంలోని జుబ్బార్ హాతీ ఎయిర్ పోర్టులో ఈ సేవలను తాను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఐఐసీ టెక్నాలజీ లిమిటెడ్ అనే ప్రయివేటు విమానయాన సంస్థ ఈ సర్వీసులను నడపనుందన్నారు. చండీగఢ్-కులు, చండీగఢ్-సిమ్లా, సిమ్లా-చండీగఢ్, సిమ్లా-గాగల్, గాగల్-సిమ్లాల మధ్య ఈ సర్వీసులు నడవనున్నాయన్నారు. కాగా, రూ.30 కోట్లు ఖర్చు చేసి ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా జుబ్బార్ హాతి విమానాశ్రయాన్ని పునరుద్ధరించింది.