: తుని విధ్వంసం వెనుక చంద్రబాబు హస్తం!... అందుకే సీఐడీ విచారణ!: ముద్రగడ సంచలన వ్యాఖ్యలు
కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కొద్దిసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో తాము నిర్వహించిన కాపు ఐక్య గర్జనలో చోటుచేసుకున్న హింస వెనుక టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు హస్తం ఉందని ఆయన ఆరోపించారు. కాపులను చీల్చేందుకు కుట్రలు పన్నుతున్న చంద్రబాబు... ఆ క్రమంలోనే తునిలో విధ్వంసానికి తెర తీశారని ధ్వజమెత్తారు. తుని విధ్వంసకారులంటూ పోలీసులు అరెస్ట్ చేసిన కాపు యువకులను బేషరతుగా విడుదల చేయడంతో పాటు వారిపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేసిన ముద్రగడ కొద్దిసేపటి క్రిత కిర్లంపూడిలోని తన సొంతింటిలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా సంచలన ఆరోపణలు గుప్పించారు. నేటి సాయంత్రంలోగా అరెస్ట్ చేసిన కాపు యువకులందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేసిన ముద్రగడ... తన డిమాండ్ నెరవేరని పక్షంలో రేపు ఉదయం 9 గంటలకు దీక్షకు దిగడం ఖాయమని ప్రకటించారు. ఈ దీక్షతో విజయమో, వీరస్వర్గమో తేలిపోతుందని కూడా ముద్రగడ కీలక వ్యాఖ్యలు చేశారు. కాపులకు వ్యతిరేకంగా చంద్రబాబు చేపట్టిన చర్యల కారణంగా కాపుల్లో ఐక్యత వచ్చిందని ఆయన చెప్పారు. తుని విధ్వంసంలో తన పాత్ర ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతోనే చంద్రబాబు సీబీఐ దర్యాప్తుకు భయపడుతున్నారన్నారు. తాము సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తే... చంద్రబాబు ప్రభుత్వం మాత్రం సీఐడీ దర్యాప్తునకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక ఉన్న మతలబు ఇదేనని ఆయన పేర్కొన్నారు.