: ఏం నిర్ణయం తీసుకుందాం?... కోదండరాం అధ్యక్షతన టీజేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం ప్రారంభం
ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన హైదరాబాద్‌లో తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. రెండు రోజుల క్రితం తెలంగాణ ఉద్యమ కీలక నాయకుడు కోదండరాం ప్రభుత్వ పాలనపై పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను ప్రభుత్వ వర్గాలు తిప్పికొడుతూ ఆయనపై పలు విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో కోదండరాం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తనపై చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ.. నేడు జరగనున్న తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా తాము ఆచరించవలసిన అంశాలపై పలు కీలక నిర్ణయాలు, టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై సమాధానం చెప్పే అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. దీంతో టీజేఏసీ సమావేశం అనంతరం ఎలాంటి నిర్ణయం వస్తుందోనని సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండేళ్లలో అనుసరించిన విధానాలు, వైఫల్యాలపై తాము అనుసరించాల్సిన విధానాలను టీజేఏసీ సమావేశం అనంతరం వెల్లడించే అవకాశం ఉంది.