: కేసీఆర్ తో భేటీకి రెండు సార్లు యత్నించా... అయినా అపాయింట్ మెంట్ లభించలేదు: కోదండరాం సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కొద్దిసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. మరికాసేపట్లో జేఏసీ భేటీ జరగనున్న నేపథ్యంలో ఓ తెలుగు న్యూస్ ఛానెల్ తో మాట్లాడిన ఆయన... తనకు కేసీఆర్ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. సీఎంను కలిసేందుకు రెండు సార్లు యత్నించినా, తనకు అపాయింట్ మెంట్ లభించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు జేఏసీ తీసుకున్న నిర్ణయాలను సీఎం ఆఫీస్ కు పంపుతూనే ఉన్నామని కూడా ఆయన పేర్కొన్నారు. అయినా తనపై టీఆర్ఎస్ నేతలు, మంత్రులు ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. మంత్రుల విమర్శలపై తాను వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయబోనని కోదండరాం అన్నారు. మంత్రులు, టీఆర్ఎస్ నేతలు తనపై చేసిన విమర్శలపై జేఏసీనే స్పందిస్తుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ప్రజలు, ప్రాంతాల మధ్య ఆర్థికపరమైన వ్యత్యాసం పెరిగిపోతుందన్న విషయాన్నే తాను చెప్పానని, ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. తన వ్యాఖ్యలకు సంబంధించిన రికార్డులున్నాయని, అవరసరమైతే వాటిని పరిశీలించుకోవచ్చని కూడ కోదండరాం కీలక వ్యాఖ్యలు చేశారు.