: బెట్టువీడని కాపునేత... ఇంకా జీపులోనే 'మౌనముద్ర'గడ!
కాపు ఐక్య ఉద్యమవేదిక నేత ముద్రగడ పద్మనాభం ఇంకా బెట్టు వీడలేదు. కాపు గర్జన సందర్భంగా తునిలో చోటుచేసుకున్న విధ్వంసం ఘటనలో అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలంటూ ముద్రగడ తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ముద్రగడను పోలీసు వాహనంలో రాజమండ్రికి అక్కడి నుంచి మళ్లీ అమలాపురం... అటు నుంచి తిరిగి కిర్లంపూడికి తీసుకొచ్చారు. అప్పటికే ఆయన నివాసానికి తాళాలు వేసిన కాపు ఉద్యమకార్యకర్తలు, ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని ముద్రగడ డిమాండ్ చేశారు. లేదా తనను అరెస్టు చేయాలని సూచిస్తూ పోలీసు జీపు దిగకుండా, మౌనంగా కూర్చున్నారు. సీట్లోనే భీష్మించుకుని కూర్చోవడంతో పోలీసులు ఆందోళన చెందుతున్నారు.