: ముద్రగడ మౌనం... పోలీసు వాహనం దిగని వైనం!
కాపు ఐక్య ఉద్యమవేదిక నేత ముద్రగడ పద్మనాభంను తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన నివాసానికి తీసుకుని వచ్చారు. అయితే ముద్రగడ పోలీసు వాహనం దిగకుండా, మౌనం వహించారు. పోలీసులు తమను కూడా అరెస్టు చేయాలన్న డిమాండ్ తో ఆయన సీట్లోనే బీష్మించుకుని కూర్చున్నారు. ఒకవైపు కాపుల రిజర్వేషన్లు కల్పిస్తామని, కాపులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్న ప్రభుత్వం మరోవైపు అరెస్టులు చేయడంపై ముద్రగడ అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విచారణ పేరుతో తమను ఎందుకు జీపులో తీసుకెళ్లారు? రాజమండ్రి, అమలాపురం తిప్పి కిర్లంపూడి తీసుకురావాల్సిన అవసరం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. కేవలం కాపులను వేధించడంలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని కాపు నేతలు అభిప్రాయపడుతున్నారు. విచారణ చేయాలనుకుంటే కిర్లంపూడిలోనే చేయవచ్చని, తమను జిల్లా మొత్తం తిప్పడంలో ప్రభుత్వం ఉద్దేశ్యం అర్ధం చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. కాపుగర్జన విధ్వంసం కేసులో అరెస్టైన వారు కాపులు కూడా కాదని, రాజకీయ కక్ష సాధింపులో భాగంగా వారిని అరెస్టు చేశారని, వారిని కాపుగర్జన అల్లర్లలో పాలుపంచుకున్న వారిగా చూపిస్తూ కాపులకు కళంకం తెచ్చేవిధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారని, వారిని తక్షణం విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.