: నైజీరియన్లను దేశంలోకి అనుమతించొద్దు: గోవా మాజీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
దేశ రాజధాని ఢిల్లీలో నైజీరియన్లపై జరిగిన దాడులపై వివాదం చెలరేగుతోన్న విషయం తెలిసిందే. అయితే, నైజీరియన్లను దేశంలోకే అనుమతించవద్దని గోవా మాజీ ముఖ్యమంత్రి రవి నాయక్ అంటున్నారు. అంతేకాదు, వారిపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. దేశంలోకి వారిని రానీయకుండా నిషేధించాలని ఆయన సూచించారు. దేశంలోకి వారు ప్రవేశిస్తుండడంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. వారు డ్రగ్స్ అమ్మేందుకు వస్తున్నారా..? చదువుకోవడానికి వస్తున్నారా..? అని రవి నాయక్ ప్రశ్నించారు. ఈ అంశంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. నైజీరియన్లు ఢిల్లీతో పాటు దేశంలోని పలు నగరాల్లో దాదాగిరి చేస్తున్నారని ఆయన అన్నారు. గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ కూడా వారం రోజుల క్రితం నైజీరియన్లను విమర్శించిన విషయం తెలిసిందే. నైజీరియన్ల జీవన విధానంతో గోవా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని పర్సేకర్ అన్నారు.