: తెలంగాణ ఉద్యమకారులకు అలుపులేదు: ఆర్మూర్ సభలో టీఆర్ఎస్
ప్రత్యేక రాష్ట్రం సాకారమయ్యే వరకు తెలంగాణ ఉద్యమకారులకు అలుపులేదని టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు పేర్కొన్నారు. నేడు ఈ సభలో పాల్గొన్న తెలంగాణ వాదులు పెద్దగా విరామం తీసుకోకుండానే ఎల్లుండి సంసద్ యాత్రకు బయల్దేరతారని కేసీఆర్ తెలిపారు. నేటి తెలంగాణ ఉద్యమం కొత్త పుంతలు తొక్కుతోందని, ప్రత్యేక తెలంగాణే అందరి లక్ష్యమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
కేసీఆర్ నేడు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో నిర్వహిస్తోన్న టీఆర్ఎస్ ఆవిర్భావసభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ 12 ఏళ్ళుగా తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోస్తోందని వ్యాఖ్యానించారు. తెలంగాణ వచ్చేవరకు ఉద్యమం ఆగబోదని ఈ సందర్భంగా ఆయన ప్రధానికి స్పష్టంచేశారు. ప్రధానికి చిత్తుశుద్ధి ఉంటే పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
ఇక తెలంగాణకు అడ్డుగా ఉంది ఇక్కడివారే అని పరోక్షంగా తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ నాయకులపై విమర్శలు గుప్పించారు. ఆంధ్ర ప్రాంత నాయకుల్లో ఉన్న ఐక్యత తెలంగాణ పార్టీల్లో లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేళ్ళ ప్రస్థానంలో అన్ని పార్టీల రంగులు తెలిశాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కాగా, తాజాగా తాము అనుసరిస్తున్న విధానాల పట్ల ఆకర్షితులైన మరికొందరు ఎంపీలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.