: తెలంగాణ ప్రజల ఆశలకు కోదండరామ్ గండి కొడుతున్నారు: మంత్రి నాయిని
కోదండరామ్ తమ ప్రభుత్వ పథకాలు, పాలనపై చేసిన విమర్శలపై టీఆర్ఎస్ నేత, మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఈరోజు హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో స్పందించారు. తమ ప్రభుత్వం భూములను బలవంతంగా లాక్కుంటోందని అనడం సరికాదని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడా ఇవ్వని ప్యాకేజీ తెలంగాణ ఇస్తోందని ఆయన తెలిపారు. రైతుల ఆత్మహత్యల నివారణకు ఏ సీఎం కూడా తీసుకోలేని చర్యలను కేసీఆర్ తీసుకుంటున్నారని ఆయన అన్నారు. మిషన్ కాకతీయ అందులో భాగమేనని చెప్పారు. మిషన్ కాకతీయ పథకానికి దేశ వ్యాప్తంగా ప్రశంసలొస్తున్నాయని నాయిని అన్నారు. మిషన్ భగీరథ కార్యక్రమాన్ని కోదండరామ్ కలలో కూడా ఊహించి ఉండరని ఆయన అన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కోదండ రామ్‌కి కనిపించడం లేదా..? అని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆశలకు కోదండరామ్ గండి కొడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కోదండరామ్‌ని జేఏసీ ఛైర్మన్ చేసింది ఎవరో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.