: కిర్లంపూడి టూ కిర్లంపూడి... వయా అమలాపురం, రాజమండ్రి!: ముద్రగడను సొంతింటికి తరలిస్తున్న ఖాకీలు!
కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని పోలీసులు ఆయన సొంతూరుకు తరలిస్తున్నారు. తుని విధ్వంసకారుల పేరిట పలువురు కాపు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారన్న సమాచారంతో నేటి ఉదయం తన సొంతూరు కిర్లంపూడి నుంచి బయలుదేరిన ముద్రగడ... నేరుగా అమలాపురం పోలీస్ స్టేషన్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. తుని ఘటనకు కర్త, కర్మ, క్రియ మొత్తం తానేనని ప్రకటించిన ముద్రగడ తనను అరెస్ట్ చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. అయితే, తుని విధ్వంసాన్ని గుర్తుకు తెచ్చుకున్న పోలీసులు ముద్రగడను అరెస్ట్ చేసేందుకు సాహసించలేదు. ఈ నేపథ్యంలో అమలాపురానికి పెద్ద సంఖ్యలో కాపులు తరలివస్తున్న క్రమంలో పరిస్థితులు అదుపు తప్పే ప్రమాదం ఉందన్న అనుమానంతో ముద్రగడను పోలీసులు రాజమండ్రిలోని సీఐడీ కార్యాలయానికి తరలించారు. అయితే అక్కడ కూడా ముద్రగడను ఉంచడం క్షేమం కాదని భావించిన పోలీసులు ముద్రగడను ఆయన సొంతూరు కిర్లంపూడికే తరలించేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలో గట్టి బందోబస్తు మధ్య ఆయనను రాజమండ్రి నుంచి కిర్లంపూడికి తరలిస్తున్నారు. మరికాసేపట్లోనే ముద్రగడను కిర్లంపూడిలోని ఆయన స్వగృహంలో పోలీసులు వదిలిపెట్టనున్నట్లు సమాచారం. వెరసి నేటి ఉదయం కిర్లంపూడిలోని తన సొంతింటి నుంచి బయలుదేరిన ముద్రగడ మధ్యాహ్నానికంతా... అమలాపురం, రాజమండ్రిల మీదుగా తిరిగి తన స్వగ్రామానికే చేరుకున్నట్లవుతుంది.