: మీరు చాలా డైనమిక్.. మీలా కావాలనుకుంటున్నాను, ఏం చెయ్యాలి?: విజయవాడలో స‌్మృతి ఇరానీతో విద్యార్థిని
విజయవాడ పాతబస్తీలోని గుజరాతీ స్కూల్‌లో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ విద్యార్థినులతో ముఖాముఖిలో పాల్గొంటున్నారు. గుజరాతీ స్కూల్‌లో నూతన ల్యాబ్‌ను ప్రారంభించిన తరువాత ఆమె కాసేపు విద్యార్థినులతో ముచ్చటించి, వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ముఖాముఖిలో భాగంగా స్మృతి ఇరానీని ఓ విద్యార్థిని పొగిడేసింది. ‘మీరు చాలా డైనమిక్, నేనూ మీలా ఓ డైనమిక్ మహిళను కావాలనుకుంటున్నాను. నాకు మీరే స్ఫూర్తి.. మీలా ఎదగాలంటే ఏం చెయ్యాలి..?’ అని అడిగింది. దానికి స్మృతి సమాధానమిస్తూ ‘విద్యార్థినులు బయటి వారిని కాకుండా ఇంట్లో వారిని, తమ చుట్టూ ఉన్నవారినే స్ఫూర్తిగా తీసుకోవాలి’ అని అన్నారు. తన కుటుంబంలోని వ్యక్తులను, టీచర్లనుంచి ఓ వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో విద్యార్థినులు రాణించాలని ఆమె సూచించారు. ఉన్నతవిద్యలో విద్యార్థినులు బాగా రాణించాలని ఆమె అన్నారు. విద్యార్థినులతో ముఖాముఖి కార్యక్రమంలో స్మృతి ఇరానీతో పాటు ఆంధ్రప్రదేశ్ నేతలు కామినేని, ఎంపీ కంభంపాటి పాల్గొన్నారు.