: తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిపోనున్న డబుల్ డెక్కర్ రైలు
కాచిగూడ నుంచి తిరుపతి, గుంటూరు మధ్య తిరుగుతున్న డబుల్ డెక్కర్ రైలును ఆంధ్రప్రదేశ్ కు తరలించి, విశాఖ నుంచి తిరుపతి మధ్య నడిపించాలని రైల్వే బోర్డు నిర్ణయించినట్టు సమాచారం. ఈ రైలుకు ప్రయాణికుల నుంచి అంతగా స్పందన లేదని, రైలు ఖాళీగా తిరుగుతోందని భావించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి డబుల్ డెక్కర్ ఏసీ రైళ్ల కోసం చాలా రాష్ట్రాలు ప్రయత్నించినప్పటికీ, తెలంగాణ లాబీయింగ్ ఫలించడంతో ఈ రైలు రాష్ట్రానికి వచ్చిన సంగతి తెలిసిందే. కాచిగూడ నుంచి తిరుపతికి రెండు రోజుల పాటు, గుంటూరుకు రెండు రోజుల పాటు రాకపోకలు సాగిస్తున్న రైలు చాలా వరకూ ఖాళీగానే తిరుగుతోంది. ఇక దీన్ని తెలంగాణ నుంచి ఏపీకి చేర్చి విశాఖ నుంచి రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరుల మీదుగా తిరుపతికి నడిపితే ప్రయాణికుల స్పందన ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అసలు కారణాలు చెప్పకుండా, సాంకేతిక ఇబ్బందులంటూ, ఈ నెల 12 నుంచి 30 మధ్య రైలును నిలిపివేస్తున్నామని రైల్వే శాఖ చేసిన ప్రకటన వెనుక అసలు విషయం ఇదేనని తెలుస్తోంది.