: మోదీ సర్కారుకు షాకిచ్చిన కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్!... రిజర్వేషన్లు జాట్ల హక్కు అని ప్రకటన!
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి చౌదరి బీరేందర్ సింగ్ తన సొంత సర్కారుకే షాకిచ్చారు. రిజర్వేషన్ల కోసం మరోమారు రోడ్డెక్కి కేంద్ర ప్రభుత్వానికి పెను సవాల్ విసిరిన జాట్లకు అనుకూలంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘రిజర్వేషన్లు జాట్ల హక్కు. యాదవ్ లు, గుజ్జార్లు... జాట్లకు ఏమాత్రం తేడా లేదు’’ అని ఆయన ఢిల్లీలో వ్యాఖ్యానించారు. ఇటీవలే రిజర్వేషన్ల కోసం రోడ్డెక్కిన జాట్లు... పెను విధ్వంసానికి పాల్పడటమే కాక కేంద్రం, హర్యానా ప్రభుత్వాలకు గట్టి షాకిచ్చారు. తాజాగా నిన్న మరోమారు ఆందోళనలకు దిగిన జాట్లను నిలువరించేందుకు ఇప్పటికే కేంద్రం భారీ ఎత్తున బలగాలను మోహరించింది. ఈ నేపథ్యంలో బీరేందర్ సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.