: హత్య చేస్తున్నారా? లేదా?... కలకలం రేపుతున్న రాంవృక్ష్ యాదవ్ వీడియోలు!
ఉత్తరప్రదేశ్ లోని మధుర అల్లర్లకు ప్రధాన కారకుడిగా భావిస్తున్న రాంవృక్ష్ యాదవ్ పాల్పడ్డ అకృత్యాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. నగరంలోని 300 ఎకరాల పరిధిలోని జవహర్ బాగ్ ను కబ్జా చేసిన యాదవ్... అందులో వేలాది మందిని పోగేసి తన అనుచరులుగా మార్చుకున్నాడు. దాదాపు అక్కడ సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన యాదవ్... రెండేళ్ల పాటు రెచ్చిపోయాడు. మొన్న అలహాబాదు హైకోర్టు ఆదేశాలతో కబ్జా స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన పోలీసులపై భీకర దాడికి తెర తీశాడు. ఈ దాడిలో ఎస్పీ స్థాయి అధికారి సహా ఓ సీఐ, మరో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో యాదవ్ ఉన్మాద చర్యలు ఒక్కటొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తాజా వీడియోలో చిన్నపిల్లలను కూడా హింసా ప్రవృత్తి వైపు దారి మళ్లేలా ఉద్రేకపూరిత ప్రసంగాలు చేశాడు. ‘‘హత్య చేస్తున్నారా? లేదా?’’ అంటూ తన అనుచరుల్లో ద్వేషం రగిల్చాడు. వెరసి పోలీసులపై 3 వేల మంది దాకా మూకుమ్మడిగా దాడి చేసేలా ప్రోత్సహించాడు. అయితే మొన్న జరిగిన అల్లర్లలో యాదవ్ కూడా చనిపోయాడు.