: కొత్తపార్టీ పెడుతున్నా... పేరు సూచించండి: అజిత్ జోగి
ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బతగిలింది. ఆ రాష్ట్ర కీలక నేత అజిత్ జోగి ఆ పార్టీతో తెగదెంపులు చేసుకున్నారు. తాను కొత్తగా పార్టీ పెడుతున్నానని ఆయన ప్రకటించారు. బిలాస్ పూర్ జిల్లా మార్వాహిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ, తాను పెట్టనున్న కొత్త పార్టీకి పేరు సూచించాలని ప్రజలను కోరారు. అలాగే పార్టీ విధివిధానాలపై సూచనలు చేయాలని ఆయన మద్దతుదారులకు సూచించారు. కాగా, రాహుల్ ను ఏఐసీసీ చీఫ్ గా చేస్తారని వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్రంలో కీలక నేత అజిత్ జోగి పార్టీ పెడుతున్నట్టు ప్రకటించడం విశేషం. అయితే జోగి కొత్త పార్టీ తమ పార్టీపై ఎలాంటి ప్రభావం చూపదని ఆ రాష్ట్ర సీఎం రమణ్ సింగ్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జోగి పార్టీ ప్రకటన ఎలాంటి ప్రభావం చూపదని ఆయన స్పష్టం చేశారు.