: మాల్యా అడ్రెస్ దొరకలేదు!... మరోమారు వాయిదాపడ్డ చెక్ బౌన్స్ కేసు!


బ్యాంకులకు రూ.9 వేల కోట్ల రుణాలను ఎగవేసి ఎంచక్కా విదేశాలకు చెక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఎక్కడుంటున్నారన్న విషయం ఇప్పటికీ తెలియలేదు. బ్రిటన్ రాజధాని లండన్ శివారులోని అత్యంత విలాసవంతమైన భవంతిలో మాల్యా నివాసముంటున్నారని వార్తా కథనాలు వెల్లువెత్తినా అటు పోలీసు అధికారులకు గాని, ఇటు ప్రభుత్వానికి గాని ఆయన అడ్రెస్ కు సంబంధించి పక్కా ఆదారాలు తెలియడం లేదట. దీంతో జీఎంఆర్ సంస్థ మాల్యాపై దాఖలు చేసిన చెక్ బౌన్స్ కేసు మరోమారు వాయిదా పడింది. శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వినియోగించుకున్న కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అందుకు సంబందించి రుసుమును చెల్లించలేదు. ఈ క్రమంలో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ఇచ్చిన చెక్కులు బ్యాంకుల్లో బౌన్స్ అయ్యాయి. దీంతో హైదరాబాదులోని ఎర్రమంజిల్ కోర్టును ఆశ్రయించిన జీఎంఆర్... మాల్యాపై ఫిర్యాదు చేసింది. ఈ కేసును విచారించిన కోర్టు ఇప్పటికే మాల్యాను దోషిగా తేల్చింది. అయితే దోషిగా తేలిన వ్యక్తి తన ఎదుట హాజరైతే తప్పించి శిక్షను ఖరారు చేయడం కుదరదని కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో మాల్యాకు జారీ చేసిన వారెంట్లను ముంబై పోలీసులు తిరిగి కోర్టుకే అందజేశారు. వారెంట్లలో పేర్కొన్న అడ్రెస్ లో మాల్యా లేరని వారు కోర్టుకు తెలిపారు. దీంతో మాల్యా సరైన అడ్రెస్ కనుక్కోండని పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన కోర్టు విచారణను నేటికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. నేటి విచారణకు కూడా పోలీసులు మాల్యా అడ్రెస్ ను సమర్పించలేకపోయారు. దీంతో సరైన అడ్రెస్ లేకుండా మాల్యాకు వారెంట్లు జారీ చేయలేమని తేల్చిచెప్పిన కోర్టు... కేసు తదుపరి విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News