: నీళ్లలో వాటా సాధించి తీరుతాం, వెనక్కి తగ్గం: కడియం శ్రీహరి
కృష్ణా, గోదావరి నదుల నీళ్లే ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోన్న సాగునీటి ప్రాజెక్టులపై వివాదం చెలరేగుతుండడంతో ఈరోజు మంత్రి హరీశ్‌రావు ఢిల్లీలో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన సందర్భంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందించారు. ఈరోజు ఆదిలాబాద్‌లో పర్యటిస్తోన్న ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా, గోదావరి జలాల్లో తమ వాటా సాధించి తీరుతామని ఆయన చెప్పారు. ఏపీ నేతలు తెలంగాణకు చెందాల్సిన నీళ్ల వాటాను, తాము నిర్మిస్తోన్న ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూస్తున్నారని కడియం ఆరోపించారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని ఆయన ఉద్ఘాటించారు. ఈ అంశంపై తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకమై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రైతుల ప్రయోజనాల దృష్ట్యా తాము ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలని కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.