: జగన్ వయసు నా అనుభవమంత లేదు!... అతడితోనే నాకు పెను సమస్య!: చంద్రబాబు ఘాటు వ్యాఖ్య
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మరోమారు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన అనుభవమంత వయసు లేని జగన్ తనకు పెను సమస్యగా పరిణమించారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా పరిధిలోని అమరావతిలో శరవేగంగా కొనసాగుతున్న తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడే మీడియాతో మాట్లాడిన చంద్రబాబు జగన్ పై విరుచుకుపడ్డారు. ‘‘సీఎం పదవిలో ఉన్న వ్యక్తికే జగన్ సవాల్ విసురుతాడా? జగన్ వయసు నా రాజకీయ అనుభవమంత లేదు. రాజకీయాల్లో హుందాతనం అవసరం. వైఎస్ సహా ఎంతోమందిని చూశా. కాని జగన్ కారణంగా ఎదురవుతున్న సమస్యలు నాకు ఎప్పుడు ఎదురు కాలేదు’’ అని చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.