: ఉద్యోగుల వాదన సరికాదు... 27 లోగా అమరావతికి వచ్చి తీరాల్సిందేనన్న చంద్రబాబు
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో తమకు సరిపడ సౌకర్యాలు లేవన్న ఉద్యోగుల వాదనపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి ఉదయం అమరావతి పరిధిలోని వెలగపూడిలో శరవేగంగా నిర్మాణం సాగుతున్న తాత్కాలిక సచివాలయ పనులను ఆయన పరిశీలించారు. అక్కడ నిర్మాణం జరుగుతున్న ఆరు భవనాలను ఆయన ఆసాంతం పరిశీలించారు. ఆ తర్వాత అక్కడే ఆయన మీడియాతో మాట్లాడారు. నిర్ణీత గడువు (ఈ నెల27)లోగా తాత్కాలిక సచివాలయం పనులు పూర్తవుతాయని ఆయన ప్రకటించారు. రాజధాని ప్రాంతంలో సరైన సౌకర్యాలు లేవని ఉద్యోగులు చెప్పడం సరికాదన్నారు. ఉద్యోగులకు కావాల్సిన వసతులన్నీ కల్పించామన్నారు. 27 నాటికి తరలించాల్సిన శాఖలకు సంబంధించి రోడ్ మ్యాప్ విడుదల చేస్తామని ప్రకటించారు. ఫైళ్లు, రికార్డులు, డేటా... అన్నింటినీ సకాలంలోనే తెప్పిస్తామని చంద్రబాబు విస్పష్టంగా పేర్కొన్నారు.