: కీలక మలుపు తిరిగిన విశాఖ లావణ్య మృతి కేసు!... టీడీపీ ఎమ్మెల్యే అనిత వ్యాఖ్యలే కారణం!
విశాఖ జిల్లాలో ఓ కామాంధుడు ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీకొట్టిన కారణంగా లావణ్య అనే గృహిణి చనిపోయిన కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హేమంత్ కుమార్ తో పాటు మరో యువకుడిని విశాఖ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. భర్తతో కలిసి ఆలయానికి వెళ్లిన లావణ్యను వేధింపులకు గురి చేసిన హేమంత్... ఆ తర్వాత బైక్ పై వెళుతున్న ఆమెను తన కారుతో ఢీకొట్టాడన్న ఆరోపణలతో ఈ వ్యవహారం ఏపీలో కలకలం రేపింది. అయితే అధికార పార్టీ నేతల అండతో హేమంత్ కుమార్ రోజుల తరబడి పోలీసులకు చిక్కలేదు. కేసును తనకు అనుకూలంగా మలుచుకున్న తర్వాతే అతడు పోలీసులకు చిక్కాడని కూడా వార్తలు వినిపించాయి. దీంతో ఈ కేసులో అసలు వాస్తవాలు తేలకుండానే ముగిసిపోతుందని అంతా భావించారు. అయితే అధికార పార్టీకి చెందిన పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత ఈ కేసుపై తాజాగా గళం విప్పారు. ఈ కేసులో పోలీసులు చెబుతున్న వాదనపై తనకు అనుమానాలున్నాయని ఆమె నిన్న వ్యాఖ్యానించారు. అధికార పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే తమ దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు ఈ కేసును తిరిగి దర్యాప్తు చేయక తప్పని పరిస్థితి నెలకొంది.