: సినిమా స్టోరీ చెప్పిన వైఎస్ జగన్!... ఆ సినిమాలో చంద్రబాబే విలనట!


వైసీసీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్ర ఏపీలో రాజకీయ ప్రకంపనలను సృష్టించింది. పరుష పదజాలంతో కూడిన ఆరోపణలు, ప్రత్యారోపణలకు ఈ యాత్ర కారణమైంది. ఐదు రోజుల పాటు ఆ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నాన్ స్టాప్ గా సాగిన యాత్రను నిన్న ఓబుళదేవరచెరువు మండలం వడ్డివారిపల్లెలో జగన్ ముగించారు. ఈ సందర్భంగా ఆ గ్రామంతో పాటు అనంతపురంలోని అంబేద్కర్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన ప్రజాస్వామ్య పరిరక్షణ సభలో జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా జగన్ ఓ సినిమా స్టోరీని చెప్పారు. సదరు సినిమాలో తనను తాను హీరోగా అభివర్ణించుకున్న జగన్... టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును మాత్రం విలన్ గా పేర్కొన్నారు. ఇరువురి పాత్రలను పరోక్షంగా పేర్కొన్న జగన్ చెప్పిన సదరు సినిమా కథకు వైసీపీ కార్యకర్తల నుంచి మంచి స్పందనే వచ్చింది. సదరు సినిమా కథను జగన్ ఇలా చెప్పుకొచ్చారు. ‘‘13 రీళ్లలో విలన్ దే పై చేయిగా ఉంటుంది. హీరో మాత్రం అమాయకుడు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాడు. 14వ రీలులో కథ క్లైమాక్స్ కు చేరుకుంటుంది. అప్పుడే కథ అడ్డం తిరుగుతుంది. ఆఖరి నిమిషంలో విలన్ జైలుకు పోతాడు. చివరకు హీరోనే రాజవుతాడు’’ అని జగన్ సదరు సినిమాను ఆసక్తికరంగా చెప్పారు.

  • Loading...

More Telugu News