: అలీ శ్వాస విడిచినా... ఆయన గుండె మాత్రం ఆగలేదు!
బాక్సింగ్ దిగ్గజం మహ్మద్ అలీ మొన్న తుది శ్వాస విడిచారు. సుదీర్ఘ కాలం పాటు పార్కిన్సన్ వ్యాధితో సతమతమైన అలీ... మొన్న శ్వాస తీసుకోవడం కష్టం కావడంతో మరో మారు ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో చికిత్స తీసుకుంటున్న క్రమంలోనే ఆయన తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలో ఆయన శరీరంలోని అన్ని అవయవాలు పనిచేయడం మానేశాయి. అయితే ఆయన గుండె మాత్రం ఆగిపోలేదట. అలీ శరీరంలోని అన్ని అవయవాలు అచేతనావస్థలోకి చేరుకున్న తర్వాత కూడా ఆయన గుండె ఏకంగా అరగంట పాటు కొట్టుకుంటూనే ఉందట. ఈ ఆసక్తికర విషయాన్ని ఆయన కుమార్తె హనా... ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ‘‘శరీరంలోని అన్ని అవయవాలు పనిచేయకుండా పోయినా ఆయన హృదయం మాత్రం ఆగలేదు. దాదాపు 30 నిమిషాలు కొట్టుకుంటూనే ఉంది. ఇది ఆయన మనోస్థైర్యానికి, సంకల్ప బలానికి అసలైన పరీక్ష. ఇలా ఇంతకుముందెవరూ దీనిని చూసి ఉండరు’’ అని హనా పేర్కొంది.