: మళ్లీ రోడ్డెక్కిన జాట్లు... స్తంభించిన హర్యానా
గతంలో ప్రభుత్వం ప్రకటించిన విధంగా రిజర్వేషన్లు అమలు చేయాలని, తమ కోటాను పెంచాలని డిమాండ్ చేస్తూ, నేటి నుంచి 15 రోజుల పాటు జాట్ సంఘాలు పిలుపు ఇవ్వడంతో హర్యానా స్తంభించిపోయింది. ముఖ్యంగా జాట్ల సంఖ్య అధికంగా ఉన్న రోహ్ తక్, సోనిపట్, ఖైతాల్ తదితర ప్రాంతాల్లో సమ్మె ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జాట్ల అల్లర్ల కారణంగా 30 మంది చనిపోగా, 300 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. పోలీసుల మెతక వైఖరి కారణంగానే పరిస్థితి అదుపు తప్పిందని అప్పట్లో విమర్శలు రాగా, ఇప్పుడు మాత్రం హర్యానా సర్కారు ముందుగానే స్పందించింది. మొబైల్ ఇంటర్నెట్ సేవలను, బల్క్ ఎస్ఎంఎస్ లను నిషేధించింది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పారా మిలటరీ బలగాలను రంగంలోకి దించింది. స్పెషల్ కంట్రోల్ రూమును ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని, ఇటీవలి నిరసనల అనంతరం అమాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఆల్ ఇండియా జాట్ ఆరక్షణ్ సంఘర్ష్ సమితి నేత యష్ పాల్ మాలిక్ డిమాండ్ చేశారు. అప్పటి వరకూ తాము ఉద్యమం ఆపబోమని స్పష్టం చేశారు.